తెలంగాణ: కరోనా లాక్‌డౌన్‌లో పెరిగిన బాల్య వివాహాలు

  • సురేఖ అబ్బూరి
  • బీబీసీ ప్రతినిధి
బాల్య వివాహాలు

ఫొటో సోర్స్, Getty Images

"సరిగ్గా తాళి కట్టే సమయానికి పీటల మీది నుంచి లేచి నిల్చున్నాను. కానీ, బలవంతంగా కూర్చోబెట్టి తాళి కట్టించారు. బహుశా నాకు జరిగినంత ఘోరంగా ఏ ఒక్కరికీ పెళ్లి జరిగి ఉండదు. నా వయసు ఇంకా 15 ఏళ్లే.''

తెలంగాణలోని వికారాబాద్ సమీపంలో ఓ గ్రామానికి చెందిన అపర్ణ (పేరు మార్చాం) అనే మైనర్ బాలిక తన పెళ్లి గురించి చెప్పిన మాటలు ఇవి.

''నాన్న చనిపోయినా, అమ్మ కష్టపడి చదివిస్తోంది. కానీ ఒక రోజు నన్ను చుట్టాలింటికి తీసుకెళ్లారు.ఆ వ్యక్తి పేరు కూడా తెలీదు. నా కంటే వయసులో పెద్ద కూడా. తాళి కట్టి వెళ్లిపోయాడు. పెళ్లి వద్దని ఎంత ఏడుస్తున్నా ఎవ్వరూ వినలేదు. పైగా నాన్న గుర్తొచ్చి ఏడుస్తోందని అందరికీ అబద్దం చెప్పారు. నన్ను, మా అమ్మను కూడా కొట్టారు" అని బీబీసీకి చెప్పారు అపర్ణ.

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో ఇలా బలవంతపు బాల్య వివాహానికి బలైన మైనర్ బాలికలు ఎందరో ఉన్నారు. చైల్డ్ లైన్ తదితర స్వచ్ఛంద సంస్థల నివేదికల ప్రకారం సాధారణంగా తెలంగాణలో ఒక సంవత్సరం మొత్తంలో జరిగే బాల్య వివాహాలు లాక్ డౌన్ సమయంలో కేవలం 2-3 నెలల్లోనే జరిగిపోయాయి.

ఫొటో సోర్స్, Abhyudaya Seva Samiti

ఫొటో క్యాప్షన్,

బాల్య వివాహంలో బంధువులతో మాట్లాడుతున్నా అధికారులు

మాయ మాటలు చెప్పి పెళ్లి చేసేశారు

నిజానికి అపర్ణ బాల్య వివాహం తన తల్లికి, అన్నకు ఇష్టంలేదు. ''బంధువులు బలవంతంగా పెళ్లి చేశారు. చదువుకోవాలని ఉందని చెప్పినా వినకుండా మాయ మాటలు చెప్పి తాళి కట్టించేశారు'' ఆమె బీబీసీకి వివరించారు.

"మేం ఇంటికి వచ్చేయాలనుకున్నాం. కానీ వారి ప్లాన్ తెలుసుకోలేకపోయాం. లాక్ డౌన్ ఉండటం వల్ల వాళ్లు ముందే తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. బహుశా తక్కువ ఖర్చుతో పెళ్లి చేసేయచ్చు అని అనుకొని ఉండొచ్చు. వారు మా ముగ్గుర్ని ఇంటి నుంచి బయటకి రానివ్వలేదు. మా దగ్గర ఫోన్లు కూడా లాగేసుకున్నారు’’ అని ఆ నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు అపర్ణ.

‘‘ఎల్లుండి పెళ్లని చెప్పారు. ఎలాగైనా బయట పడాలని అన్నీ ప్రయత్నాలు చేశాను. అందరినీ బ్రతిమాలాను. కానీ ఎవ్వరు వినలేదు. ఉదయమే ముహూర్తం, 9 గంటలు అయ్యే సరికి పెళ్ళి చేసేశారు. మా అమ్మ ఎక్కడ పెళ్లి ఆపేస్తుందోనని ఆమెను ముందే పక్కకి తీసుకువెళ్ళి పోయారు. అన్నకి వారు నచ్చ చెప్పడంతో ఏమి చేయాలో తనకు అర్ధం కాలేదు. మూడు రోజుల్లోనే నా జీవితం అంతా అయిపోయింది'' అని అపర్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ తరువాత ఈ వార్త ఇరుగు పొరుగు వారికి తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని తిరిగి స్వస్థలానికి పంపించేశారు.

పెళ్లి అయిపోయింది కాబట్టి, ఎప్పటికైనా భర్త ఇంటికి వెళ్లాల్సిందేనని తన మామయ్య, ఇతర బంధువులు అంటున్నారని అపర్ణ అన్నారు. ప్రస్తుతం ఆమెకు ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ సహకరిస్తోంది. ఆమె సోదరుడు చదువు మానేసి ఓ షాపులో పని చేస్తున్నారు.

గణాంకాలు చెబుతున్న నిజాలివి

లాక్‌డౌన్ సమయంలో తెలంగాణ పల్లెల్లో జరిగిన బాల్య వివాహాల గణాంకాలను చూస్తే విస్తుపోవాల్సిందే. ముఖ్యంగా మే-జూన్ నెలల్లో సుమారు 70 నుంచి 80 శాతం బాల్య వివాహాలు పెరిగినట్లు చైల్డ్ లైన్ వంటి సంస్థల నివేదికలు చెబుతున్నాయి.

2019-20 సంవత్సరంలో ఏడాది మొత్తం మీద జరిగిన బాల్య వివాహాలు లాక్‌డౌన్ సమయంలో కేవలం రెండు మూడు నెలల్లోనే జరిగి పోయాయన్నది వాటి సారాంశం.

వారు ఇచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్రం మొత్తంలో వికారాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌ నగర్ లోని తండాలలో అత్యధికంగా ఈ కేసులు నమోదు అవుతున్నాయి.

కొన్ని జిల్లాల్లో అధికం

మహబూబాబాద్ జిల్లాను పరిశీలిస్తే 2019-20 సంవత్సరంలో 60 నుంచి 80 బాల్య వివాహాలు రిపోర్ట్ కాగా, 2020-21లో 116, 2021 ఏప్రిల్‌లో 11, మేలో 40, జూన్‌లో 20 వరకు రిపోర్టయ్యాయి.

వికారాబాద్ జిల్లాలో 2019-20 సంవత్సరంలో 129, 2020-21లో 209, 2021 ఏప్రిల్‌లో 22, మేలో 78, జూన్‌లో 25 వివాహాలకు సంబంధించి రిపోర్టులు అందాయి.

ఇక మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి 2019-20 సంవత్సరంలో 112, 2020-21లో 118, 2021 ఏప్రిల్ 16, మేలో 26, జూన్‌లో 18 వరకు బాల్య వివాహాలు రిపోర్టయ్యాయి.

ఇవి కేవలం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే చైల్డ్ లైన్ కాల్ సెంటర్ 1098 లో నమోదు అయిన లెక్కలు. ఇవి కాకుండా మరి కొన్ని కేసులు 100, 181 కాల్ సెంటర్లకు ఫిర్యాదు అవుతుంటాయి.

"చిన్న వయసులోనే పెళ్ళి అంటే ఓ పండగ, కొత్త బట్టలు, బుట్ట బొమ్మలా తయారయ్యే ఓ అద్భుత అవకాశం అని కొందరు మైనర్ బాలికలు అనుకుంటున్నారు. గత 3 నెలల నుంచి కేసులు విపరీతంగా పెరిగాయి. కరోనా కారణంగా పిల్లలు హాస్టళ్లు నుంచి వచ్చేసారు. తల్లిదండ్రులు ఇద్దరూ పనికి వెళ్ళి వచ్చే సరికి వారు పక్క దారి పడుతున్నరేమో అన్నది పెద్ద వాళ్ళ అనుమానం. 14 నుంచి 16 ఏళ్ల లోపు అమ్మాయిలకే ఎక్కువగా పెళ్లిళ్లు అవుతున్నాయి. ఎక్కువమంది అమ్మాయిలు పెళ్లిని వ్యతిరేకించరు. అందువల్ల మా పని కష్టమవుతోంది" అని బాల్య వివాహాల నిర్మూలన కోసం పని చేసే చైల్డ్ లైన్ స్వచ్ఛంద సంస్థ ఉద్యోగి దేవ కుమారి బీబీసీతో చెప్పారు.

ప్రభుత్వం అనుసరించే విధానాలను కూడా బాల్య వివాహాలకు కారణమవుతున్నాయని వీటిపై పోరాటం చేస్తున్న సంఘాలు అంటున్నారు.

"కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా వచ్చే డబ్బు కోసం ఆశ పడి కూడా పేద కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు ఆడ పిల్లల నకిలీ ఆధార్ కార్డులు సృష్టిస్తున్నారు. వయసు ధ్రువీకరణ పత్రాల పరిశీలన విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలి. ఈ విషయంలో పెళ్లిళ్లు చేసే పురోహితులు మైనర్ బాలికల విషయంలో వివాహం నిర్వహించేందుకు నిరాకరించాలి. గ్రామ సర్పంచ్‌లను కూడా బాధ్యుల్నిచేసేలా నిబంధనలు మార్చాలి" అని మండాల పరశురాములు బీబీసీతో అన్నారు. పరశురాములు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అభ్యుదయ సేవ సమితి అధ్యక్షులు

ఫొటో సోర్స్, EYESWIDEOPEN

అధికారులు ఏమంటున్నారు?

ఇదే విషయమై తెలంగాణ శిశు సంక్షేమ శాఖను కూడా బీబీసీ సంప్రదించింది.

"ఈ మూడు నెలలలో మహబూబ్ నగర్‌లో జిల్లాలో గతంలో ఎన్నడూ లేనన్ని కేసులు నమోదయ్యాయి. పేదరికం, పిల్లలపై తల్లిదండ్రులకు ఉన్న అభద్రతా భావం, చిన్నప్పుడే అమ్మాయి పెళ్లి చేసేయాలి అన్న ఆలోచనలకు తోడు కొన్ని జిల్లాల్లో ఉన్న మూఢ సంప్రదాయాలు కూడా ఈ కరోనా కాలంలో బాల్య వివాహాలకు కారణమవుతున్నాయి'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి బీబీసీతో అన్నారు.

కరోనా కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పెళ్లి చేస్తే ఖర్చు కూడా కలసి వస్తుందని చాలామంది భావిస్తున్నట్లు ఆ అధికారి వెల్లడించారు.

బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలంగాణ స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి కార్యాలయం బీబీసీకి తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)